ముంబై: కేంద్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ (Shivraj Patil) కన్నుమూశారు. 90 ఏండ్ల పాటిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని లాతూర్లో ఉన్న తన స్వగృహం ‘దేవ్ఘర్’ లో తుదిశ్వాస విడిచారు. ఆయన 1980 నుంచి 2004 వరకు వరుసగా ఏడుసార్లు లోక్సభ ఎంపీగా విజయం సాధించారు.
1935, అక్టోబర్ 12న జన్మించిన పాటిల్.. లాతూర్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ ఎన్నికై రాజకీయాల్లో ప్రవేశించారు. 70వ దశకం తొలినాళ్లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం లోక్సభ ఎంపీగా గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్గా విధులు నిర్వహించారు.