PM’s wife died : నేపాల్ (Nepal) లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. తొలిరోజు నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. నిరసనల దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై బ్యాన్‌ను ఎత్తివేసింది. పలువురు మంత్రులు రాజీనామాలు చేశారు. అయినా నిరసనకారులు శాంతించలేదు.
రెండో రోజు మంత్రులు, ప్రధాన మంత్రి, మాజీ ప్రధానుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేశారు. వారి ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖానల్ నివాసానికి కూడా నిప్పంటించారు. ఆ మంటల్లో ఖానల్ సతీమణి రాబి లక్ష్మి చిత్రకార్కు తీవ్రంగా కాలినగాయాలయ్యాయి. దాంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యుల ధృవీకరించారు.
కాగా రాబి లక్ష్మి చిత్రకార్‌ను ఆందోళనకారులు బలవంతంగా ఇంట్లోపెట్టి నిప్పంటించారని ప్రధాని ఖానన్ కుటుంబసభ్యులు ఆరోపించారు. నిరసనల సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో రెండో రోజైన మంగళవారం కూడా ఇద్దరు మరణించారు. దాంతో మృతిచెందిన మొత్తం నిరసన కారుల సంఖ్య 22కు పెరిగింది.