Rajeev Chandrasekhar | కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 18 ఏండ్ల ప్రజా జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొంటూ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ లో పోస్టు పెట్టారు. అయితే పార్టీ కోసం నాకుడిగా కొనసాగుతానని పేర్కొన్నారు. ‘ఈ రోజు నా 18 ఏండ్ల రాజకీయ జీవితానికి కర్టెన్స్ దించేస్తున్నా. టీం మోదీ 2.0లో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పని చేసినందుకు గర్వ పడుతున్నాను. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన నేను ముందుగా నా 18 ఏండ్ల ప్రజా జీవితానికి దూరం కావాలని అనుకోలేదు’ అని ట్వీట్ చేశారు.
‘నాతో కలిసి పని చేసిన వారికి, నాకు మద్దతునిచ్చిన వారికి, ప్రత్యేకించి నాకు శక్తిని ప్రసాదించిన, స్ఫూర్తినిచ్చిన కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు. గత మూడేండ్లుగా ప్రభుత్వంలో సహచర మంత్రులుగా పని చేసిన వారికి కూడా ధన్యవాదాలు. నేను పార్టీ కోసం మద్దతు కొనసాగిస్తాను’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా రాజీవ్ చంద్రశేఖర్.. తిరువనంతపురం నుంచి పోటీ చేశారు. అక్కడి నుంచి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత శశి థరూర్ తో జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో 16,077 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.