లక్నో : సామూహిక లైంగిక దాడి కేసులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి, ఆయన అనుచరులు ఇద్దరికి న్యాయస్ధానం యావజ్జీవ శిక్ష విధించింది. మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతితో పాటు ఆయన అనుచరులు అశోక్ తివారీ, ఆశిష్ శుక్లాలకు కోర్టు రూ 2 లక్షల జరిమానా విధించింది. సామూహిక లైంగిక దాడి కేసులో ప్రజపతిని, ఆయన అనుచరులిద్దరిని లక్నో ప్రత్యేక న్యాయస్ధానం రెండు రోజుల కిందట దోషులుగా నిర్ధారించింది.
చిత్రకూట్‌కు చెందిన మహిళ ప్రజాపతి, ఆయన అనుచరులపై లైంగిక దాడి ఆరోపణలు చేసింది. వారు తనతో పాటు తన మైనర్ కుమార్తెపైనా దారుణానికి ఒడిగట్టారని ఫిర్యాదులో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ కేసులో ప్రజాపతి సహా ఆరుగురు వ్యక్తులపై 2017 ఫిబ్రవరి 18న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడుగురు నిందితులపై సామూహిక లైంగిక దాడి, బెదిరింపులు, పోక్సో సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. మహిళ ఫిర్యాదు ఆధారంగా 2017 మార్చి 18న ప్రజాపతిని పోలీసులు అరెస్ట్ చేశారు.