న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik) కు సీబీఐ సమన్లు జారీ చేసింది. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన రూ.300 కోట్ల లంచం ఆరోపణల కేసులో సాక్షిగా ఆయనను ప్రశ్నించనున్నది. దీని కోసం ఈ నెల 27 లేదా 28న తమ కార్యాలయానికి రావాలంటూ ఆయనకు నోటీసులు పంపింది.
కాగా, జమ్ముకశ్మీర్‌లోని కిరు జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వర్తించే రూ.2,200 కోట్ల గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో అమలు చేశారు. అయితే నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ స్కీమ్‌ను ఒక్క నెలలోనే రద్దు చేశారు. ఈ స్కీమ్‌లో అవినీతి లొసుగులు ఉన్నాయని, ఫైల్ ఆమోదం కోసం తనకు రూ.300 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై గత ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్స్యూరెన్స్ బ్రోకర్లను నిందితులుగా పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో సత్యపాల్ మాలిక్‌ను సీబీఐ ప్రశ్నించింది.
మరోవైపు ఈ పథకం ఫైల్‌ను ఆమోదించేందుకు ఆర్ఎస్ఎస్తోపాటు బీజేపీ నేత రామ్ మాధవ్ తనకు డబ్బులు ఆఫర్ చేసినట్లు సత్యపాల్ మాలిక్ ఇటీవల ఆరోపించారు. అయితే అవి నిరాధార ఆరోపణలని రామ్ మాధవ్ పేర్కొన్నారు. సత్యపాల్ మాలిక్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో మరోసారి ప్రశ్నించేందుకు సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.