పటియాలా: సైబర్ మోసానికి గురైన పంజాబ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమర్ చాహల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పటియాలాలోని తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. తుపాకీతో కాల్చుకున్న తర్వాత కొన ఊపిరితో ఉన్న ఆయనను స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. అమర్ చాహల్ సూసైడ్ నోట్ ప్రకారం.. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని కొందరు సైబర్ నేరగాళ్లు చెప్తే నమ్మి రూ.8 కోట్లు మోసపోయినట్టు పేర్కొన్నారు.
తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు క్షమించాలని కోరారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. వ్యవస్థీకృతంగా జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కోరారు.