న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, ఈడీ వేధింపుల గురించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ మారకపోతే తనను జైల్లోనే చంపేస్తామని కొందరు చెదిరించారన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన జనతా కీ అదాలత్లో సిసోదియా మాట్లాడారు. ‘కోర్టు ముందు కేజ్రీవాల్ పేరు చెప్తే నన్ను కాపాడతామని అన్నారు.
తమ పార్టీలో చేరాలని బీజేపీకి చెందిన వారి నుంచి ఒత్తిడి వచ్చింది’ అని సిసోడియా అన్నారు. తన ఆస్తులన్నింటినీ ఈడీ స్తంభింపచేయడంతో తన కుమారుడి కాలేజీ ఫీజు కోసం పలువురిని యాచించాల్సి వచ్చిందని విమర్శించారు. జైలులో ఉన్న సమయంలో తనను మానసికంగా, రాజకీయంగా నాశనం చేయడానికి ఈడీ ప్రయత్నించిందని ఆరోపించారు.