Lalu Prasad Yadav | పాట్నా, జూలై 5: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్నదని, వచ్చే నెలలోగా కూలిపోయే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ పార్టీ 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాట్నాలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్నదన్నారు.
ఆ సర్కార్ ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చని, అది ఆగస్టులోనే జరగొచ్చన్నారు. అటువంటి సందర్భం ఎదురైతే తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ బీహార్ అసెంబ్లీలో చాలా కాలంగా అతిపెద్ద పార్టీగా ఉన్నదని, ఇతర పార్టీల మాదిరిగా సిద్ధాంతాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పరోక్షంగా నితీశ్ కుమార్ని ఉద్దేశించి లాలూ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో లాలూ కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు.