న్యూఢిల్లీ, జనవరి 25: భారత్‌లోని ప్రతి పౌరునికి విదేశాల్లో పర్యటించే స్వేచ్ఛ ఉన్నదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కని ఢిల్లీ కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ కేసులో క్వాలిటీ లిమిటెడ్ కంపెనీ మాజీ ప్రమోటర్ సిద్ధాంత్ గుప్తాకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ)ని సస్పెండ్ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించింది.
తనపై ఉన్న ఎల్వోసీని సస్పెండ్ చేసేలా ఈడీని ఆదేశించాలని, తద్వారా తన కూతురిని సింగపూర్‌కు తీసుకెళ్లి అక్కడ ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేసే నిమిత్తం ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆ దేశంలో పర్యటించేందుకు వీలు కల్పించాలని సిద్ధాంత్ గుప్తా పిటిషన్ దాఖలు చేశారు.
దీన్ని విచారణకు స్వీకరించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అంజూ బజాజ్ చందన.. విదేశాల్లో పర్యటించడం సహా స్వేచ్ఛగా సంచరించే హక్కు పిటిషనర్‌కు ఉన్నదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కని తెలిపారు. నిర్దిష్ట అవసరం కోసం పరిమిత కాలంపాటు విదేశంలో పర్యటించేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నందున ఆయనపై ఉన్న ఎల్వోసీని సస్పెండ్ చేసి, విదేశీ పర్యటనకు అనుమతించడంలో ఈడీ ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని ఉత్తర్వులు జారీ చేశారు.