Indian Army | పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి కొన్ని గంటలుగా పాకిస్థాన్ కాల్పులు జరుపుతుందని తెలిపారు. భారత్-పాక్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విక్రమ్ మిస్రీ.. శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని చాటడంపై ఆయన మండిపడ్డారు. డీజీఎఈంవో మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్‌దే అని విక్రమ్ మిస్రీ తెలిపారు.సరిహద్దుల్లో సైనికులు కాల్పుల విరమణకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు సూచించామని చెప్పారు. వాస్తవ పరిస్థితిని పాక్ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నామని.. ఈ ఉల్లంఘనలను పాక్ నిలువరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కాల్పుల ఉల్లంఘనలను నిరోధించడానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు. పాక్ అతిక్రమణలను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని భారత ఆర్మీకి ఆదేశాలిచ్చామని చెప్పారు. సరిహద్దులో భారత సైన్యం ధీటుగా బదులిస్తోందని అన్నారు.