న్యూఢిల్లీ, డిసెంబర్ 5: దాతృత్వపు ఉద్దేశం ఎట్టిపరిస్థితుల్లోనూ మతమార్పిడికి దారితీయొద్దని సుప్రీం కోర్టు తెలిపింది. ఇది తీవ్రమైన సమస్య అని, బలవంతపు మత మార్పిడులు రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీం కోర్టు మరోసారి తేల్చి చెప్పింది. చారిటీలు, స్వచ్ఛంద సంస్థలు చేసే మంచి పనులను స్వాగతించాల్సిందేనని, అయితే.. వాటి ఉద్దేశాలను మాత్రం తనిఖీ చేయాలని అభిప్రాయపడింది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా, సీటీ రవికుమార్ నేతృత్వంలోని బెంచీ సోమవారం విచారణ చేపట్టింది. బెదిరింపులు, డబ్బు, బహుమతుల ఆశచూపి మత మార్పిడులు చేసే వారిపై చర్యలు తీసుకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టును లాయర్ కోరారు.
కేంద్రం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. మతమార్పిడులపై రాష్ర్టాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, ఇందుకు వారం గడువు ఇవ్వాలని విన్నవించారు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ‘చాలా తీవ్రమైన సమస్య ఇది. రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం. దేశంలో నివసించేవారంతా ఇక్కడి సంస్కృతికి తగ్గట్టు వ్యవహరించాలి’ అని పేర్కొన్నది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. కాగా, మత మార్పిడులు జాతీయ భద్రతకు, దేశ పౌరుల మత స్వేచ్ఛకు భంగమని, కేంద్రం దీనిపై దృష్టిసారించాలని గతంలో సుప్రీం కోర్టు వెల్లడించింది.
ఈడబ్ల్యూఎస్ కోటా తీర్పును సమీక్షించండి
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం కోటా కల్పించడాన్ని సమర్థిస్తూ గత నెల 7న ఇచ్చిన మెజార్టీ తీర్పును సమీక్షించాలని తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ సోమవారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాటగిరీల్లోని పేదలను మినహాయించారని, ఇది వివక్షను చట్టబద్ధం చేస్తున్నదని వాదించింది.