న్యూఢిల్లీ, నవంబర్ 14: బలవంతం, ప్రలోభం లేదా మోసకారి పద్ధతుల ద్వారా మతమార్పిడి చాలా తీవ్ర అంశమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దీన్ని అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో కృషిచేయాలని సూచించింది. అలాంటి మతమార్పిడులను ఆపకపోతే క్లిష్టపరిస్థితి రావచ్చని, జాతీయ భద్రత, పౌరుల మతస్వేచ్ఛకు ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరించింది. ప్రలోభాలతో జరిగే మతమార్పిడులను అరికట్టేందుకు చేపడుతున్న చర్యలేమిటో వివరించాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. చాలా సందర్భాల్లో మతమార్పిడి జరిగినట్టు బాధితులకూ తెలియదని, తమకేదో సాయం అందిస్తున్నారనే అభిప్రాయంతో ఉంటారని మెహతా పేర్కొన్నారు. కేంద్రం, ఇతర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో 22లోగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేసింది.