మోదీ సర్కారు పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ తీవ్రమవుతున్నది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దొరకని పరిస్థితి. పీహెచ్‌డీలు చేసిన వారు కూడా ప్యూన్ ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. పట్టణాల్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. మరోవైపు టెక్ రంగంలో వేలసంఖ్యలో ఉద్యోగాల కోతలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫోర్బ్స్ ఇండియా తాజా అధ్యయనం కూడా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగితపై ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ, నవంబర్ 12: మోదీ సర్కారు (PM Modi) అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగమేనని ఇటీవలి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేటతెల్లం కాగా.. తాజాగా ఫోర్బ్స్ ఇండియా అధ్యయనం దేశంలో నిరుద్యోగం (Unemployment) ఆందోళనకర స్థాయికి చేరిందని వెల్లడించింది. పట్టణాల్లో ఉపాధి దొరకక ఉన్నత విద్యావంతులు సైతం పల్లెబాట పడుతున్నారని, సేద్యానికి సిద్ధమవుతున్నారని ఫోర్బ్స్ పేర్కొన్నది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలోని జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగిత తీవ్రంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు మధ్య పొంతన లేకపోవడం గమనార్హం. Unemployment, PLFS
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నుంచి సేకరించిన అధికారిక డాటా ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి, రెండవ త్రైమాసికాల మధ్య పట్టణ నిరుద్యోగిత రేటు 17.9% నుంచి 18.4% పెరిగింది. ఆర్థికంగా కొంత పుంజుకున్నప్పటికీ నగరాలలో ఉపాధి కల్పన కొరవడుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నట్లు ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. 15 సంవత్సరాలు, అంతకు మించి వయసున్న వ్యక్తులకు చెందిన జాతీయ నిరుద్యోగిత రేటు 5.4% నుంచి 5.2% స్వల్పంగా తగ్గగా అదే కాలంలో యువత నిరుద్యోగిత రేటు(15-29 ఏళ్లు) 14.6% నుంచి 14.8% శాతానికి పెరగడం విశేషం.
ఉత్తరాదిలో పెరిగిన నిరుద్యోగిత
పట్టణ నిరుద్యోగిత అధికంగా తొమ్మిది రాష్ర్టాలలో పెరుగగా ఉత్తరాది రాష్ర్టాలలో ఇది తీవ్రంగా ఉంది. ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 14.9 శాతం పెరుగుదల ఉండగా హిమాచల్ ప్రదేశ్‌లో 4.3, జమ్ము కశ్మీరులో 3.5 శాతం ఉంది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రాలలో సైతం నిరుద్యోగిత రేటు పెరగడం గమనార్హం. తమిళనాడులో 2.1 శాతం, యూపీలో 2.7 శాతం పెరుగుదల ఉంది.
విద్యావంతుల పల్లెబాట
భారతదేశ పారిశ్రామిక లక్ష్యాలను దెబ్బతీసే రీతిలో కార్మిక శక్తి గ్రామీణ బాట పట్టడం ఆందోళన కలిగించే పరిణామమని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. విద్యావంతులు సైతం వ్యవసాయ రంగంవైపు తిరిగి వెళుతున్నారని తెలిపింది. వ్యవసాయంలో ఉపాధి పొందుతున్న కార్మికుల వాటా 39.5% నుంచి 42.4% పెరిగింది. తయారీ, మైనింగ్ రంగంలో కార్మికుల శాతం 26.6 నుంచి 24.2 శాతానికి తగ్గింది. సేవా రంగంలో కూడా ఉద్యోగుల శాతం 33.9 నుంచి 33.5 శాతానికి పడిపోయింది. వ్యవసాయేతర రంగాలలో కార్మికులకు ఉపాధి తగ్గిపోతుండగా వర్షాలపై ఆధారపడిన వ్యవసాయ రంగానికి వాపసు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
పారిశ్రామిక రంగంలో నిరుద్యోగిత
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ర్టాలలో ఉపాధి కల్పన తగ్గిపోవడం ఆయా పరిశ్రమలలో కార్మికుల కోతను సూచిస్తోంది. ఛత్తీస్‌గఢ్ తయారీ రంగంలో 12.4 పాయింట్ల తగ్గుదల ఉండగా ఒడిశాలో 9 పాయింట్లు పడిపోయింది. ఆంధ్రపదేశ్‌లో 7.5 పాయింట్లు, తెలంగాణలో 6.9 పాయింట్ల తగ్గుదల ఉంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హర్యానాలో మాత్రం ఈ తయారీ రంగంలో ఉపాధి స్వల్ప పెరుగుదల ఉంది. పట్టణ యువత నిరుద్యోగిత, పారిశ్రామిక ఉద్యోగాల క్షీణత, వ్యవసాయ రంగంలో ఉపాధి పెరుగుదల వంటి పరిణామాలు భారతదేశ కార్మిక మార్కెట్ దీనస్థితికి అద్దం పడుతున్నట్లు ఫోర్బ్స్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధి గణాంకాలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయేతర ఉపాధి కల్పన పటిష్టం కాకుండా కార్మిక శక్తి వ్యవసాయానికి మరలిపోవడం ఉత్పాదకతను, వేతన వృద్ధిని దెబ్బతీయగలదని ఫోర్బ్స్ ఇండియా అభిప్రాయపడింది.