కోల్‌కతా: జూనియర్ వైద్యురాలి హత్యాచారం సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నిరసనకారులను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత బెదిరించాడు. ఇళ్ల నుంచి బయటకు రాగలరా? జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఆ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. (Trinamool suspends party leader) ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పీజీ మెడికల్ విద్యార్థిని హత్యాచారానికి గురైంది. ఈ సంఘటనపై నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, జూనియర్ వైద్యురాలిపై హత్యాచారాన్ని ఖండిస్తూ నిరసనలు చేస్తున్న వారిని టీఎంసీ నేత, మాజీ కౌన్సిలర్ అతిష్ సర్కార్ బెదిరించాడు. ఇటీవల పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఆందోళనకారులను హెచ్చరించాడు. ‘జాగ్రత్తగా ఉండండి. టీఎంసీ ప్రజలు వీధుల్లో ఉన్నారు. పొరుగు ప్రాంతాలకు మేం వెళితే, మీరు ఇంటి నుండి బయటకు రాగలరా?’ అని అన్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టీఎంసీ నేత అతిష్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి ఏడాది పాటు టీఎంసీ సస్పెండ్ చేసింది.