న్యూఢిల్లీ, మే 7: మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఓ భారీ సైనిక ఆపరేషన్ వివరాలు వెల్లడించేందుకు అధికారిక విలేకరుల సమావేశాన్ని ఇద్దరు మహిళా అధికారులు నిర్వహించారు. భారతీయ సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ, భారతీయ వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యో మికా సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడా తడబాటు లేకుండా వారు చేసిన ప్రకటనలు ఉగ్రవాదంపై భా రత్ దృఢ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో నారీశక్తి పెంపును ప్రతిబింబించింది.
2016లో ది ఆసియన్ ప్లస్ మల్టీనేషనల్ ట్రెయినింగ్ ఎక్సర్సైజ్లో భారతీయ సైన్యానికి చెందిన ట్రైనింగ్ కంటెంజెంట్ ఫోర్స్ 18కి సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా సోఫియా ఖురేషీ చరిత్రలో నిలిచా రు. ఇందులో పాల్గొన్న అన్ని దేశాలకు చెం దిన సభ్యుల్లో 35 ఏళ్ల సోఫియా మాత్రమే ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్. ఆపరేషన్ సిందూర్ గురించి ఆమె మాట్లాడిన తీరు ఆమె నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటం గా వ్యక్తం చేసింది. 1990లో భారత సైన్యం లో చేరిన సోఫియా 3 దశాబ్దాలకు పైగా అసమాన ధైర్యసాహసాలు, రాజీపడని మనస్థత్వంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2006లో కాంగో పీస్‌కీపింగ్ మిషన్‌లో ఆమె పాత్ర ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపచేసింది.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో అనేక సాహసోపేత విధులు నిర్వర్తించారు. వైమానిక దళంలో గౌరవప్రదమైన స్థానంలో కొనసాగుతున్నారు. ఈశాన్య భారతంలో వరద సహాయక కార్యకలాపాల్లో అందించిన సేవలకు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ నుంచి ప్రశంసలు, అనేక పురస్కారాలు అందుకున్నారు. 2004లో వైమానిక దళంలో చేరిన ఆమె, హెలికాప్టర్ ఫ్లయింగ్లో విశిష్ట సేవలు అందించారు. చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపిన ఆమె 2017లో వింగ్ కమాండర్ హోదాకు ఎదిగారు.