USBRL | ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు రైలు ద్వారా చేరాలనే కల నెరవేరింది. తొలిసారిగా బుధవారం భద్రతా దళాలతో రైలు ఢిల్లీ నుంచి ఉధంపూర్-శ్రీనగర్-బరాముల్లా (USBRL) రైలు లింక్ ద్వారా శ్రీనగర్ చేరుకుంది. ఈ రైలును ప్రత్యేకంగా భద్రతా దళాల కోసం నడపడం విశేషం. ఈ రైలులో దాదాపు 800 మంది సైనికులను శ్రీనగర్ రైల్వే స్టేషన్‌కు తరలించారు. ఇంత పెద్ద సంఖ్యలో భద్రతా దళాలతో కూడిన రైలు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన, దేశంలోనే తొలి కేబుల్ స్టే బ్రిడ్జ్న దాటడం చరిత్రలో ఇదే తొలిసారి. జూలై 3 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర కోసం కశ్మీర్ లోయలో భద్రతా దళాలను కేంద్రం భారీగా మోహరిస్తున్నది. ఈ క్రమంలో భద్రతా దళాలను తరలించేందుకు రైల్వే బోర్డు ఈ ప్రత్యేక రైలును నడిపింది. బుధవారం ఉదయం 8 గంటలకు కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ కు రైలు బయలుదేరింది. పది గంటల ప్రాంతంలో రైలు అది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన మీదుగా ప్రయాణం సాగించింది.