న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు మరో భారీ ప్రాజెక్టు కేటాయించుకొన్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఆ రాష్ర్టానికి రూ.4,243.64 కోట్ల విలువైన ప్రాజెక్టు మంజూరు చేస్తూ ప్రధాని అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని కచ్ తీరంలో ఉన్న దీన్‌దయాళ్ పోర్టులో అంతర్భాగమైన టునా టెక్రా వద్ద భారీ కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి ఈ నిధులు కేటాయించారు. నిర్మాణం -నిర్వహణ-అప్పగింత విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో (పీపీపీ) చేపడుతారని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గుజరాత్‌కు గత ఆరు నెలల్లో కేంద్రం దాదాపు రూ.90 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరుచేసింది.
రైల్వే ఉద్యోగులకు పీఎల్బీ
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 11.27 లక్షల మంది రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు కలిపి ఎల్పీజీ నష్టాల భర్తీ కింద రూ.22,000 కోట్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
2021 జూన్ నుంచి 2022 జూలై మధ్య అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 300 శాతం పెరిగినా, ప్రభుత్వ ఆదేశాల మేరకు 70 శాతం ధరల పెంపుతోనే ఈ సంస్థలు ప్రజలకు వంటగ్యాస్ సరఫరా చేశాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అందువల్ల ఏర్పడిన నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఈ నిధులు ఇస్తున్నదని చెప్పారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (అమెండ్మెంట్) బిల్-2022కు సవరణలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి రూ.6600 కోట్లతో ప్రత్యేక పథకం అమలుచేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.