న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరువు భత్యాన్ని(Dearness Allowance) కేంద్రం పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 2 శాతం పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. 2026, జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన డీఏ అమలులోకి వస్తుంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు గడిచిన నెలలకు సంబంధించిన ఎరియర్స్ కూడా అందనున్నాయి. గత డీఏ రేటు.. బేసిక్ జీతంపై 58 శాతంగా ఉండేది. ఇప్పుడు పెంచిన డీఏతో అది 60 శాతం అవుతుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో డీఏ పెంచడం.. కొంత ఊరటనిచ్చే అంశమే.
బేసిక్ శాలరీ 18 వేలు ఉన్న ఉద్యోగి జీతం ఇప్పుడు రూ.28,800 కానున్నది. ఇక 29 వేల బేసిక్ జీతం ఉన్న వారికి 46 వేల జీతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2.5 లక్షల బేసిక్ సాలరీ ఉన్న సీనియర్ ఆఫీసర్లు ఇప్పుడు 4 లక్షల జీతం తీసుకునే ఛాన్సు ఉంది. ప్రతి ఏడాది డీఏను రెండసార్లు పెంచుతారు. జనవరితో పాటు జూలైలోనూ డీఏ పెరుగుతుంది.
డీఏ ప్రకటన ఈసారి జాప్యం కావడంతో ఉద్యోగులు నిరుత్సాహంతో ఉన్నట్లు తెలిసింది. ఇక ప్రతిపాదిత 8వ వేతన సంఘం కింద జీతాల విధానాన్ని సంస్కరించాలని ఉద్యోగ సంఘాలు మరోవైపు డిమాండ్ చేస్తున్నాయి.