బెంగళూరు: తాగుబోతు భర్త తీరు పట్ల భార్య విసిగిపోయింది. పదే పదే డబ్బులు డిమాండ్ చేసిన అతడు స్థలం అమ్మి బైక్ కొనాలని అడిగాడు. దీంతో రగిలిపోయిన భార్య అతడ్ని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా కోసింది. (Wife Kills Husband, Cuts Body) వాటిని డమ్ముల్లో ఉంచి బావిలో పడేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 10న ఉమారాణి గ్రామంలో రెండు ముక్కలుగా నరికిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని రెండు డ్రమ్ముల్లో స్థానికులు గుర్తించారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హతుడ్ని శ్రీమంత ఇట్నాలిగా గుర్తించారు. దర్యాప్తు కోసం పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అతడి భార్య సావిత్రిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ప్రశ్నించారు. తొలుత బుకాయించిన ఆమె చివరకు భర్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నదని పోలీసులు తెలిపారు.
మరోవైపు భర్త శ్రీమంత నిత్యం తాగి, డబ్బు కోసం అసభ్యకరంగా తిట్టి తనను వేధించినట్లు భార్య సావిత్రి ఆరోపించిందని పోలీస్ అధికారి తెలిపారు. డిసెంబర్ 8న భార్యకు చెందిన స్థలాన్ని అమ్మి బైక్ కొనాలని భర్త అడిగినట్లు చెప్పారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి వేళ ఇంటి బయట నిద్రించిన భర్త గొంతు నొక్కి భార్య హత్య చేసిందని అన్నారు. రాయితో ముఖం చిద్రం చేసి మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికిందని, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వాటిని ఉంచి బావిలో పడేసిందని వివరించారు. నిందితురాలైన సావిత్రిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.