రాంచీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత జార్ఖండ్‌లోని నాలుగు జిల్లాలకు తొలిసారి రైలు సౌకర్యం అందుబాటులోకి రానున్నది. (rail connectivity) ఖుంటి, సిమ్దేగా, గుమ్లా, చత్రా జిల్లాలను రైలు మార్గంతో అనుసంధానించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాంచీ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ రైల్వే ప్రాజెక్ట్ కోసం ప్రాథమిక సర్వే నివేదికను పూర్తి చేసినట్లు తెలిపింది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వే బోర్డుకు పంపినట్లు పేర్కొంది.
కాగా, ప్రస్తుతం ఉన్న రాంచీ-లోహర్దగా రైలు మార్గంతో గుమ్లా, ఖుంటి, సిమ్దేగా జిల్లాలను అనుసంధానిస్తారు. అలాగే రాంచీ-హజారీబాగ్ రైలు మార్గంలో చత్రా జిల్లాను కలుపుతారు. జార్ఖండ్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ సర్వేను పూర్తి చేసింది. లోహర్దగా నుంచి గుమ్లా వరకు 55 కిలోమీటర్లు, గుమ్లా నుంచి సిమ్దేగా వరకు 43 కిలోమీటర్లు, హతియా నుంచి ఖుంటి వరకు 20 కిలోమీటర్లు, హజారీబాగ్ నుంచి చత్రా వరకు 42 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని నిర్మిస్తారు.
మరోవైపు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లోని ఏడు జిల్లాల్లో కొత్త రైల్వే లైన్లు, ఇతర ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌ను గత ఏడాది ఆగస్ట్‌లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రూ.6,500 కోట్ల వ్యయంతో చేపట్టే మూడు రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.