Corona Crisis | యోగేష్ అనే 34 ఏండ్ల కుర్రాడు.. స్కూల్కెళ్తున్నప్పుడే పైలట్ కావాలని ఆకాంక్షించాడు. కానీ పైలట్ అయ్యాక తిరిగి మళ్లీ వ్యవసాయం చేయాల్సి వస్తుందని ఏనాడూ ఊహించలేదు. 18 ఏండ్ల వయస్సులో కావడానికి శిక్షణ పొంది.. ఒక విమానయాన సంస్థలో పైలట్‌గా చేరాడు. అటుపై 2019 డిసెంబర్లో తాను పని చేస్తున్న ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అధిక వేతన ప్యాకేజీ కోసం మరో విమానయాన సంస్థలో చేరాలనుకున్నాడు. కానీ దురదృష్టం ఆయన్ను వెంటాడింది.
2020 ప్రారంభంలో కరోనా మహమ్మారి విసిరిన పడగను తప్పించుకోవడానికి భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ తలుపులు మూసేశాయి.. విదేశీయులను అనుమతించలేదు. అంతే కాదు.. మహమ్మారిని నియంత్రించడానికి, దేశీయంగా ప్రజల సామూహిక కదలికల కట్టడికి వివిధ దేశాలు లాక్డౌన్ కూడా విధించాయి. దీని ప్రభావం విమానయాన రంగంపై భారీగానే పడింది. నాటికే జెట్ ఫ్యూయల్ ధర సమస్యతో తల్లడిల్లుతున్న ఎయిర్‌లైన్స్ కునారిల్లిపోయాయి. పలు సంస్థలు పొదుపు చర్యలు చేపట్టాయి. అలా యోగేశ్‌కు ఆఫర్ ఇచ్చిన ఎయిర్‌లైన్స్ పొదుపు చర్యల్లో భాగంగా దాన్ని వెనక్కు తీసుకుంది.
అంతకుముందు పని చేసిన ఎయిర్‌లైన్స్‌తో 10 ఏండ్లు పని చేస్తానని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు యోగేశ్. కానీ మధ్యలోనే వైదొలగడంతో తమకు పరిహారం కింద రూ.58.5 లక్షలు చెల్లించాలని నోటీసు పంపింది సదరు ఎయిర్‌లైన్స్. ఇందులో రూ.8.5 లక్షలు ట్రైనింగ్ ఫీజు.. మిగతా రూ.50 లక్షలు పరిహారం అని పేర్కొంది. అయితే, అప్పటికీ రాజీనామాను ఆమోదించలేదు. దీంతో 2020 మార్చిలో మళ్లీ పైలట్‌గా సేవలు ప్రారంభించాడు. కరోనా మహమ్మారి ప్రారంభంలో విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం సాగింది. విధులు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే హౌసింగ్ సొసైటీ యాజమాన్యం.. గూండాలను పంపి బయటకు వెళ్లగొట్టింది. అదీ కూడా కాలనీ వాసులంతా కరోనా బారీన పడ్డప్పుడు జరగడం గమనార్హం.
బెంగళూరులో నివాసం ఉంటున్న యోగేశ్.. తన భార్యతో కలిసి నగర శివారుల్లోని తండ్రి ఫామ్‌హౌస్‌కు బస మార్చేశాడు. ఇప్పుడు ఆయన వేతనం రూ.30-35 వేల మధ్య వస్తున్నది. అదీ ఆయనకు వచ్చే డ్యూటీలను బట్టే సుమా.. రుణ వాయిదాల చెల్లింపుల కోసం బైక్ అమ్మేశాడు. గతేడాది జూన్‌లో అసలే కరోనా కష్టాలతో రోకటిపై రోలు పోటు అన్నట్లు ఆయన భార్యకు గర్భస్రావమైంది. ఇది తమ జీవితానికి కష్ట కాలం అని అంటారు యోగేశ్.
అయినా యోగేశ్ కష్టాలు తగ్గలేదు. 2020 ఆగస్టు నాటికి పరిస్థితులు మరింత విషమించాయి. అతడితోపాటు మరికొందరు పైలట్లను యాజమాన్యం తొలగించేసింది. దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు యోగేశ్.. ఆయన మిత్రబృందం. ఉద్యోగం నుంచి ఎయిర్‌లైన్స్ తొలగించేశాక కొత్త కొలువు సంపాదించుకోవడం కష్టమైంది. దీంతో డెలివరీ ఏజెంట్‌గా చేరాడు. రోజూ 13-14 గంటలు పని చేస్తే గానీ నెలకు రూ.10 వేల ఆదాయం లభించేది. పైలట్‌గా నెలకు రూ.లక్ష వేతనం అందుకున్న తాను రూ.10 వేలు మాత్రమే సంపాదిస్తున్నందుకు డెలివరీ ఏజంట్‌గా చేరినట్లు తన తల్లిదండ్రులకు చెప్పలేదన్నాడు.
వివిధ రుణాలపై నెలవారీ వాయిదాలు చెల్లించడానికి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేస్తూనే ఉన్నాడు. గత ఫిబ్రవరిలో తన తల్లిదండ్రులకు కోవిడ్ సోకిందని చెప్పాడు యోగేశ్. వారికి విశ్రాంతినిచ్చేందుకు పొలంలోకి దిగి పని చేయడం ప్రారంభించాడు. గత జూన్‌లో ఢిల్లీ హైకోర్టు.. పైలట్లందరినీ తిరిగి తీసుకోవాలని జారీ చేసిన ఆదేశాలపై ఆశాభావంతో ఉన్నాడు యోగేశ్. అయితే, పరిస్థితి మెరుగు పడితే గానీ తమ వంటి వారిని ఎయిర్‌లైన్స్ విధుల్లోకి తీసుకోవని తనకు తెలుసునన్నాడు.
పైలట్ శిక్షణ కోసం రూ.30 లక్షల రుణం తీసుకున్నాడు. కమర్షియల్ పైలట్ ఫీజు రూ.45 లక్షలు చెల్లించాలి. ట్రైనింగ్, పరీక్ష ఫీజు రూ.15 లక్షలు కలిపితే మొత్తం ఖర్చు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుంది. ఒకవేళ ఆరు నెలల పాటు పైలట్‌గా విధులు నిర్వర్తించకపోతే పైలట్ లైసెన్స్ రెన్యూవల్ కోసం రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ యోగేశ్ చెల్లించాల్సిన అవసరముంది. కనుక ఈ పరిస్థితుల్లో తాను పైలట్‌గా పని చేసిన సంగతి ఎక్కడా బయటపెట్టలేదని యోగేశ్ పేర్కొన్నాడు. పరిస్థితులు మెరుగైతేనే తిరిగి తమకు ఉద్యోగాలు వస్తాయన్నాడు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
BYJU’S | బైజూస్ చేతికి అమెరికా `ట్యింకర్`
Gold price: భారీగా తగ్గిన బంగారం ధరలు
6.7 శాతానికే ఎస్బీఐ హోమ్ లోన్