న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలోని టాయిలెట్లు అసౌకర్యంగా మారాయి. పాలిథిన్ బ్యాగులు, డైపర్లు, గుడ్డలు అడ్డుపడటంతో మూసుకుపోయాయి. అపరిశుభ్రత వల్ల చాలా టాయిలెట్లను వినియోగించలేని పరిస్థితి తలెత్తింది. (Air India plane toilets mess) ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. మార్చి 5న అమెరికాలోని చికాగో ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యింది.
కాగా, ఆ విమానంలోని 12 టాయిలెట్లలో 8కిపైగా వినియోగానికి వీలు లేకుండా అసౌకర్యంగా మారాయి. పాలిథిన్ బ్యాగులు, డైపర్లు, గుడ్డలు అడ్డుపడటంతో టాయిలెట్లు మూసుకుపోయాయి. దీంతో సుమారు గంటన్నర ప్రయాణం తర్వాత ఆ విమానాన్ని తిరిగి చికాగో ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
మరోవైపు ఈ అంశంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. పాలిథిన్ బ్యాగులు, డైపర్లు, గుడ్డలు వంటివి అడ్డుపడటంతో విమానంలోని 12 టాయిలెట్లలో 8 నిరూపయోగంగా మారినట్లు తెలిపింది. ‘ఆ సమయానికి విమానం అట్లాంటిక్ మీదుగా ఎగురుతోంది. యూరప్‌లోని కొన్ని ప్రాంతాలకు మళ్లించడానికి అవకాశం లేదు. చాలా యూరోపియన్ విమానాశ్రయాల్లో రాత్రి కార్యకలాపాలపై ఆంక్షలున్నాయి. దీంతో విమానాన్ని తిరిగి చికాగోకు మళ్లించాలని నిర్ణయించాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.