గౌహతి: అస్సాంలోని ఖాజిరంగా(Kaziranga) జాతీయ పార్కులో ప్రస్తుతం వరద ఉదృతి అదుపులో ఉన్నది. ఇటీవల వచ్చిన వర్షాల వల్ల ఆ పార్క్‌లో నీరు చేరింది. ఖాజిరంగాపార్క్తో పాటు టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్ అరుణ్ విఘ్నేశ్ తెలిపారు. వరద నీటి ఉదృతి తగ్గుతోందని, పరిస్థితి అదుపులోకి వస్తోందని, అడవిలోని మృగాలు క్షేమంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వాధికారులు నిత్యం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. మృగాలకు నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ సీజన్లో ఇది తొలి వేవ్ మాత్రమే అని, రాబోయే వర్షాకాలం రోజుల్లో సంభవించే వరదలను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఖాజిరంగా జాతీయ పార్కు ఖడ్గ మృగాలకు ఫేమస్. వాస్తవానికి ఇక్కడ ప్రతి ఏడాది వర్షాకాలంలో పరిస్థితి సంక్లిష్టంగా ఉంటుంది. 2024లో వర్షాలు, వరదల వల్ల సుమారు 174 జంతువులు చనిపోయాయి. దాంట్లో 10 ఖడ్గ మృగాలు కూడా ఉన్నాయి. వార్షిక వరదలను ఎదుర్కొనేందుకు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. జాతీయ రహదారి 37 మార్గంలో కాన్వాయ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వన్య మృగాలు సురక్షితంగా కర్బి అన్లాంగ్ కొండల్లోకి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
బిశ్వనాథ్ జిల్లాలో వాహనాల వేగాన్ని నియంత్రిస్తున్నారు. వరదల సమయంలో జంతువులు రోడ్డుపైకి వస్తుంటాయని, ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ 15 మార్గంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఖాజిరంగా పార్కులో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా.. ఓరాంగ్ జాతీయ పార్కు 40 శాతం వరద నీటితో నిండింది. ధనశ్రీ, పంచ్ నాడి నదుల నుంచి నీరు ఉదృతంగా ప్రవహిస్తున్నది. అక్కడ 12 ఫారెస్ట్ క్యాంపులపై ప్రభావం పడింది. ఎన్నో రోడ్లు ధ్వంసం అయ్యాయి.