న్యూఢిల్లీ: భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ పాక్కు అంతర్జాతీయ స్థాయిలో నిధుల వరద మాత్రం ఆగడం లేదు. నెలక్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి సుమారు రూ.8500 కోట్ల ప్యాకేజీని పొందిన పాక్, తాజాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి మరో 800 మిలియన్ డాలర్ల ప్యాకేజీని పొందగలిగింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్కు భవిష్యత్లో ఆర్థిక సాయం ఆపేయాలంటూ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నది. ఈ నిధులను ప్రజా అభివృద్ధి కోణంలో కాకుండా ఉగ్రవాద చర్యలకు, సైనిక అవసరాలకు ఉపయోగించే అవకాశమున్నదని ఆరోపిస్తున్నది. 2018లో పాక్ జీడీపీ 13 శాతం ఉండగా, 2023 నాటికి 9.2 శాతానికి చేరిందని చెబుతున్నది. అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న ఈ సాయాన్ని రక్షణ రంగం అభివృద్ధికి మాత్రమే పాక్ వినియోగిస్తున్నదని అంతర్జాతీయ సంస్థలతో భారత్ వాదిస్తున్నది.