హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ) : సాధారణంగా గంటలో ముగిసిపోవాల్సిన ప్రయాణం. కానీ ప్రకృతి కరుణించలేదు. గమ్యం కండ్ల ముందే ఉన్నా భూమిపై అడుగు పెట్టనివ్వలేదు. గంటలపాటు గాల్లో చక్కర్లు, అందులో ఉన్న 22 మంది ప్రయాణికులను ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. కింద కమ్ముకున్న దట్టమైన మేఘాలతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో దిగాల్సిన ఫ్లై91 విమాన ప్రయాణం మరిచిపోలేని ఓ పీడకలను కండ్ల ముందే చూపించింది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు శంషాబాద్ నుంచి 22మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లై91.. సరిగ్గా సాయంత్రం 4.30గంటలకు హుబ్బళ్లి ఎయిర్పోర్టులో దిగాలి.విమానం టేకాఫ్ అయినప్పుడు వాతావరణం ప్రశాంతంగానే ఉన్నా.. గగనతలంలోకి చేరుకోగానే సీన్ మారిపోయింది.
ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు కారణంగా రన్వే కనిపించకపోవడంతో పైలట్ ల్యాండింగ్ నిలిపివేశారు. వాతావరణం సర్దుకుంటుందన్న ఆశతో విమానం గంటసేపు అక్కడే ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. గంటలు గడుస్తు న్నా… విమానం కిందకి దిగకపోవడంతో ప్రయాణికుల్లో గుబులు మొదలైంది. పరిస్థితిని గమనించిన పైలట్ భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. చివరకు సాయంత్రం 6.30గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 11గంటలకు వాతావరణం స్థిరపడిన తర్వాత హుబ్బళ్లికి ప్రయాణం మొదలు కావడంతో ఉత్కంఠకు తెర పడింది. దీనిపై ఫ్లై91 స్పందిస్తూ.. ఇదీ సాంకేతిక లోపం కాదనీ, వాతావరణ పరిస్థితుల వల్ల తీసుకున్న భద్రతా చర్య మాత్రమేనని స్పష్టంచేసింది.