Air India | ఎయిర్ ఇండియాను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. సాంకేతిక సమస్యలతో విమానాలు మొరాయిస్తున్నాయి. దాంతో ప్రయాణికులు కంపెనీపై మండిపడుతున్నారు. ఆదివారం హిండన్ విమానాశ్రయం నుంచి గోవాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు ముందే సమస్య తలెత్తింది. దాంతో విమానాన్ని రద్దు చేశారు. విమానం రద్దు గురించి ప్రయాణికులకు సమాచారం అందించగా.. వారంతా ఆందోళన చేపట్టారు. చాలామంది ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. టికెట్ డబ్బులు రీఫండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అనిర్బన్ అనే యూజర్ ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ.. విమాన క్యాన్సిల్ చేసినట్లుగా ఇప్పుడే సమాచారం అందింది. డబ్బులు ఎవరు తిరిగి చెల్లిస్తారు? అంటూ ప్రశించారు. కోల్‌కతా నుంచి హిండన్ చేరుకున్న విమానం గోవాకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ప్రయాణికులంతా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. టేకాప్ అకస్మాత్తుగా నిలిచిపోయి.. రద్దు చేయడంతో గందరగోళం నెలకొంది. సాంకేతిక లోపం కారణంగా విమానం రద్దు చేసినట్లుగా తెలుపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవా విమానం ఉదయం 10.40 గంటలకు బయలుదేరి.. సాయంత్రం కోల్‌కతాకు చేరుకుంటుంది. ఆదివారం గోవా విమానం రద్దు కావడంతో సాయంత్రం బయలుదేరాల్సిన కోల్‌కతా విమానం సైతం రద్దయ్యింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రయాణికులకు పూర్తి డబ్బు వాపస్, రీషెడ్యూల్ ఆప్షన్స్ సైతం ఇచ్చినట్లు వివరించారు.