ముంబై, జూలై 7 (నమస్తే తెలంగాణ): దేశంలో కురుస్తున్న భారీ వర్షాలు పలు రాష్ర్టాలను అతలాకుతలం చేస్తున్నాయి. కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడి భారీ నష్టాన్ని మిగల్చగా, జమ్ముకశ్మీర్‌లోని ధోడా జిల్లాలోని థాత్రి పట్టణం ఆకస్మిక వరదలకు అతలాకుతలమయ్యింది. మహారాష్ట్రలోని ముంబైలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కేరళలోని మలప్పురం-వయనాడ్ జిల్లాలను అనుసంధానించే అనాక్కాంపొయిల్- మేప్పాడి టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జ్ సమీపంలో మంగళవారం భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందగా, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఉన్నతస్థాయి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఇక జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా ధాత్రి పట్టణంలో మంగళవారం కురిసి భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల ధాటికి పలు ఇండ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దోడా-కిష్దార్ జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మహారాష్ట్రవ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు దంచికొట్టాయి.దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణశాఖ సూచనల మేరకు జూలై 8 వరకూ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోని పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ముంబై అష్టదిగ్బంధనంలో చిక్కుకుంది. రాగల 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలతో పాటు, గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.