MSP | చండీగఢ్, ఫిబ్రవరి 19: ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా పలు డిమాండ్ల సాధనకు ‘ఢిల్లీ చలో’ పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన నాలుగో విడత చర్చలు విఫలం అయ్యాయి. కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర సర్కార్ ఐదేండ్ల ప్లాన్‌ను ప్రతిపాదించగా.. దాన్ని రైతు నేతలు తిరస్కరించారు. ఒప్పందం మేరకు ఐదేండ్ల పాటు పప్పుధాన్యాలు, మక్కజొన్న, పత్తిని ఎంఎస్పీకి కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రులు ఆదివారం రాత్రి చర్చల అనంతరం పేర్కొన్నారు. దీనిపై సోమవారం చర్చలు జరిపిన రైతు నేతలు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్రం తెచ్చిన ప్రతిపాదన రైతులకు ఎంత మాత్రం ప్రయోజనం చేకూర్చదని రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ బృందం ఆదివారం రాత్రి 8.15 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం గోయల్ మీడియాతో మాట్లాడుతూ రైతులతో ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత కేంద్ర సంస్థలు వారి నుంచి ఐదేండ్లపాటు పప్పుధాన్యాలు, మక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తెలిపారు. ఈ మేరకు కందులు, మినుములు, మసూర్ పప్పు, మక్కజొన్న పండించే రైతులతో కేంద్ర సంస్థలు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ఒప్పందం కుదుర్చుకొంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా కొనుగోలు చేసే పంట ఉత్పత్తి పరిణామంపై ఎలాంటి పరిమితి ఉండదన్నారు. ఇందు కోసం ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆందోళనలను విరమించాలని ఈ సందర్భంగా ఆయన రైతులను కోరారు. రైతులు చేస్తున్న ఇతర డిమాండ్లు పాలసీకి సంబంధించినవని, వీటిపై లోతైన చర్చ జరగాల్సి ఉందన్నారు.
చట్టబద్ధతపై వెనక్కు తగ్గేది లేదు
అంతకుముందు రైతు నేత శర్వాన్ సింగ్ పంధేర్ సోమవారం పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్పీకి చట్టబద్ధతపై వెనక్కు తగ్గేది లేదని శర్వాన్ సింగ్ స్పష్టం చేశారు. రైతు రుణమాఫీతో సహా పలు ఇతర డిమాండ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.
చర్చల్లో పాల్గొన్న పంజాబ్ సీఎం
కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మొజాంబిక్, కొలంబియా నుంచి పప్పుధాన్యాలను దిగుమతి చేసుకొంటున్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ దిగుమతులు 200 కోట్ల డాలర్ల మేర ఉన్నాయని, దేశంలో ఈ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తే, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్ దేశంలోనే అగ్రభాగాన ఉంటుందని అన్నారు.
కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్కేఎం
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తిరస్కరించింది. సీ2+50% విధానంలో ఎంఎస్పీ కల్పించాలన్న డిమాండ్ నుంచి పక్కదారి పట్టించేందుకు, ఆ డిమాండ్‌ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం తాజా ప్రతిపాదనలు చేసిందని ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనల్లో ఎంఎస్పీ అనేది సీ2+50% విధానంలో లేదా ఏ2+ఎఫ్ఎల్+50% ఫార్ములా ఆధారంగా ఇస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని పంటలను ఎంఎస్పీకి కచ్చితంగా కొనుగోలు చేయడం మినహా మరే ప్రతిపాదనలు ఆమోదనీయం కాదని పేర్కొన్నది. ఎంఎస్పీపై 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేకుంటే.. ఆ విషయాన్ని నిజాయితీగా ప్రజలకు చెప్పాలని ఎస్కేఎం పేర్కొన్నది.
23న ఢిల్లీకి మార్చ్: నోయిడా రైతులు
మరోవైపు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తున్న నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులు ఈనెల 23న ఢిల్లీకి మార్చ్ చేపడుతామని హెచ్చరించారు. గతంలో సేకరించిన తమ భూములకు పరిహారాన్ని పెంచాలని, ప్లాట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక అధికారులు, దాద్రిలోని ఎన్టీపీసీకి వ్యతిరేకంగా దాదాపు 200 గ్రామాలకు చెందిన రైతులు గత ఏడాది డిసెంబర్ నుంచి ఆందోళనలు చేస్తున్నారు. వేలాది మంది ఈ నెల 8న ఢిల్లీకి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. నోయిడా సరిహద్దుల్లో పోలీసులు మధ్యలోనే అడ్డుకొన్నారు.