డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వాహనం బోల్తాపడిన ఘటనలో ఐదుగురు పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. బుధవారం బాగేశ్వర్ నుంచి మున్సియరీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న సహాయక, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో పలువురు గాయపడగా.. క్షతగాత్రులను కాప్కోట్ ఆసుప్రతిలో చేర్పించారు. మృతులు బెంగాల్‌కు చెందిన వారుగా సమాచారం. రెండు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఓ వాహనం రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ఉండగా.. ఐదుగురు మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బల్వంత్ సింగ్ భోర్యాల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఆసుప్రతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.