Pakistanis | పహల్గాం దాడి ఘటన అనంతరం పాకిస్తాన్‌పై భారత్ కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో పాకిస్తానీలను స్వదేశానికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉంటున్న పాకిస్తానీ పౌరులను తిరిగి ఆ దేశానికి పంపే పనిలో పడ్డాయి. అయితే, దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 5వేల మంది పాకిస్తానీలు పౌరులు ఉన్నట్లుగా గుర్తించారు. భారత నిఘా విభాగం ఈ మేరకు జాబితాను ఢిల్లీ పోలీసులకు అందించింది.
ఢిల్లీలో నివాసం ఉంటున్న 5వేల మంది పాకిస్తానీ పౌరుల జాబితాను ఐబీ ఢిల్లీ పోలీసులకు అందించి.. స్వదేశానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నది. విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) ఈ జాబితాను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక శాఖకు అందించింది. జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. జాబితాలో దీర్ఘకాలిక వీసాలు (LTV) కలిగి ఉన్న, మినహాయింపు పొందిన హిందూ పాకిస్తానీ జాతీయుల పేర్లు సైతం ఉన్నారు. ఈ జాబితా ధ్రువీకరణ కోసం సంబంధిత జిల్లా అధికారులకు అందించి.. వారంతా స్వదేశానికి తిప్పి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్య, ఈశాన్య జిల్లాల్లో పాకిస్తానీ జాతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఈ విషయంపై సమావేశం ఏర్పాటు చేశామని.. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
పరిస్థితిని సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు. ఢిల్లీలో నివసిస్తున్న ఈ పాకిస్తానీ పౌరుల గురించి సమాచారాన్ని సేకరించి, వీలైనంత త్వరగా భారతదేశం విడిచి వెళ్లేలా ఢిల్లీ పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక శాఖ అధికారులు అప్పగించారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సార్క్ వీసాలను రద్దు చేసింది. ఇప్పటికే వీసాలపై భారత్‌కు వచ్చిన వారంతా మే ఒకటో తేదీ వరకు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.