Teenagers Drown | ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన గుజరాత్లోని బోటాడ్ పట్టణంలో చోటు చేసుకున్నది. స్థానికంగా ఉన్న కృష్ణసాగర్ నదిలో ఇద్దరు బాలురు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే నీటి మునగడంతో కేకలు వేయగా.. అక్కడే ఉన్న ముగ్గురు వీరిని రక్షించేందుకు వెళ్లి నీటిలో దూకడంతో వారు సైతం నీటిలోనే మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు. ఈత కొట్టేందుకు వచ్చి ఇద్దరు నీటిలో మునిగిపోయారని, కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు నీటమునిగారని బాటోడ్ ఎస్పీ కిశోర్ బలోలియా తెలిపారు. మృతులందరి వయసు 16 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.