బాలాసోర్ : ఇండోనేషియా, మలేషియాలోని అడవుల్లో ఉండే అత్యంత అరుదైన ఒరాంగుటాన్లు ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అడవుల్లో ప్రత్యక్షం కావటం తీవ్ర కలకలం రేపింది. భారతీయ అడవుల్లో ఏనాడూ కనిపించని, అసలు మన దేశానికే చెందని ఐదు ఒరాంగుటాన్లు బాలాసోర్ డివిజన్ గ్రామీణ ప్రాంతంలో మంగళవారం ప్రత్యక్షం కావటం ఇక్కడి అటవీ శాఖ అధికారుల్ని ఉలిక్కిపడేలా చేసింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించగా అవి విదేశీ అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన ‘ఒరాంగుటాన్లు’ అన్న విషయాన్ని గుర్తించారు. అసలివి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై దర్యాప్తు మొదలైంది.