అడ్డగుట్ట: ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలని నార్త్ లాలాగూడ ధర్మపురి కాలనీవాసులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. బుధవారం నార్త్ లాలాగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బస్తీవాసులు మాట్లాడుతూ.. ధర్మపురి కాలనీలోని ఓ యజమాని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని, అంతేకాకుండా ఆ స్థలంలో ఉన్న సుమారు 70 ఏండ్ల నాటి చెట్టును కొట్టేసినట్లు చెప్పారు.
సుమారు 100 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్థ్థలాన్ని కాపాడి సదరు ఆక్రమణదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు వేణుగోపాల్, శ్రీనివాస్, సాయి మనోహర్, సాయికిరణ్ తదితరులు కోరారు.