అల్వర్, సెప్టెంబర్ 9 : రాజస్థాన్లోని అల్వర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఓటర్లకు పంచడానికి కలాకండ్(స్థానిక స్వీటు) బాక్సులో రూ. 500 నోట్లు పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ స్వీటు బాక్సుపైన కాంగ్రెస్ అభ్యర్థి దులీచంద్ బైర్వా ఫొటో ముద్రించి ఉండడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరుగగా ముందు రోజు రాత్రి 1 గంట ప్రాంతంలో దివకారీ వార్డులో ఒక కారులోనుంచి బాక్సులను దింపుతుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు అవి ఏమిటని ప్రశ్నించారు. దీంతో కారును, బాక్సులను వదిలి ఆ వ్యక్తులు పారిపోయారు. ఆ బాక్సులను స్థానికులు తెరిచి చూడగా అందులో కలాకండ్తోపాటు రూ. 500 నోట్లు కనిపించాయి.