Narendra Modi Cabinet | ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్ లో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కు బీజేపీ నుంచి సీఎంగా పని చేసిన రాజ్ నాథ్ సింగ్‌కు మంత్రి పదవి లభించింది. గతంలో వాజపేయి ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా పని చేసిన రాజ్ నాథ్ సింగ్.. మోదీ తొలి ప్రభుత్వంలో హోంమంత్రిగా, మోదీ 2.0లో రక్షణ మంత్రిగా ప్రమాణం చేశారు.
మధ్యప్రదేశ్ సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విదిశ స్థానం నుంచి ఎన్నికయ్యారు.
హర్యానా నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన మనోహర్ లాల్ ఖట్టర్.. 2014 నుంచి ఇటీవల లోక్ సభ ఎన్నికల ముందు వరకూ హర్యానా సీఎంగా పని చేశారు.
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారుడు, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి కూడా మోదీ మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణం చేశారు. 2008లో తొలుత బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి.. 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీఎంగా రెండోసారి పని చేశారు.
బీహార్‌కు చెందిన జీతన్ రామ్ మాంఝీ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. 2014 ఎన్నికల్లో జేడీయూ బీహార్ నుంచి ఓటమి పాలవ్వడంతో సీఎంగా రాజీనామా చేసిన నితీశ్ కుమార్.. జీతన్ రాం మాంఝీని సీఎంను చేశారు. కానీ 2015లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట మాంఝీని తప్పించారు. ఆ వెంటనే హిందూస్థాన్ అవామీ మోర్చా అనే పార్టీని స్థాపించిన మాంఝీ.. ఎన్డీఏలో భాగస్వామిగా చేశారు.
మోదీ మంత్రి వర్గంలో ప్రమాణం చేసిన సర్బానంద్ సోనోవాల్ 2014లో తొలిసారి కేంద్ర మంత్రిగా చేరారు. 2016లో జరిగిన అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కేంద్ర క్యాబినెట్ పదవికి రాజీనామా చేసి అసోం సీఎంగా ప్రమాణం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత హిమంత బిశ్వ శర్మ.. అసోం సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో తిరిగి సోనోవాల్ కేంద్ర మంత్రి వర్గంలో చేరారు.