చండీగఢ్: గొడ్డు మాంసం తిన్నాడన్న అనుమానంతో వలస వచ్చిన వ్యక్తిని గో సంరక్షక బృందం సభ్యులు కొట్టి చంపారు. (Migrant killed in Haryana) మృతుడ్ని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లిం వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సాబీర్ మాలిక్, హర్యానాకు వలస వచ్చాడు. బంధారా గ్రామ సమీపంలోని ఒక గుడిసెలో నివసిస్తున్న అతడు వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించి వాటిని అమ్ముకుని జీవిస్తున్నాడు.
కాగా, సాబీర్ మాలిక్ గొడ్డు మాంసం తింటున్నాడని గో సంరక్షక బృందం సభ్యులు అనుమానించారు. ఆగస్ట్ 27న ప్లాస్టిక్ బాటిల్స్ కొనుగోలు పేరుతో ఒక షాప్ వద్దకు అతడ్ని పిలిపించారు. సాబీర్ మాలిక్‌ను అక్కడ కొట్టారు. కొంత మంది స్థానికులు జోక్యం చేసుకోవడంతో వారు అతడ్ని మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ దారుణంగా కొట్టడంతో సాబీర్ మాలిక్ మరణించాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సాబీర్ మాలిక్ మృతిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడ్ని కొట్టి చంపిన నిందితులు అభిషేక్, మోహిత్, రవీందర్, కమల్జిత్, సాహిల్‌ను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు.