(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): నిశిరాత్రి ఏవో రయ్యిమంటూ వస్తున్నట్టు రాడార్‌లో అలర్ట్ మెసేజీ. ఏమైందోనని చూస్తే.. కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి. వాటి సంగతేంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థను వాటి మీదకు మళ్లించారు. అలా రాడార్‌తో సహా వాళ్ల దృష్టి అటు వైపునకు మళ్లిందో లేదో ఇటు నుంచి కొన్ని యుద్ధ విమానాలు మూకుమ్మడిగా ఎటాక్ ప్రారంభించాయి. లిప్తపాటులో క్షిపణి ప్రయోగాలు, బాంబుల మోత. అయ్యయ్యో.. ఏమైందోనని వాళ్లు తేరుకొన్నారో లేదో.. అంతకు ముందు ఉరికివచ్చిన డ్రోన్లు క్లిక్‌మంటూ ఫొటోలు, వీడియో రికార్డింగులు. ప్రతిదాడికి సిద్ధమవుదామనుకొంటుండగానే ఇటు విమానాలు గాయబ్.. అటు డ్రోన్లు మటుమాయం. ఇదేదో హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ అనుకొంటే పొరపాటే. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత త్రివిధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇలాగే జరిగిందని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు.
ప్లాన్ ప్రకారం కన్ఫ్యూజన్
రక్షణ రంగ నిపుణుల కథనం ప్రకారం.. పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత రక్షణ దళం సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేసింది. ఇందులో భాగంగా పాక్ సరిహద్దుల్లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక డ్రోన్లతో రెక్కీ నిర్వహించింది. రెక్కీలో పాల్గొన్న డ్రోన్లలో కొన్ని పాక్, పీవోకేలోని ఉగ్ర శిబిరాలకు సమీపంలో తచ్చాడాయి. అయితే, ఈ డ్రోన్ల ఉనికిని పాక్ రక్షణ దళానికి చెందిన రాడార్లు గుర్తించాయి. దీంతో ఆయా డ్రోన్లను ట్రాక్ చేయడంలో పాక్ సేనలు మునిగిపోయాయి. ఇదే అదునుగా రాఫెల్ యుద్ధ విమానాలు సెకండ్ల వ్యవధిలో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై స్కాల్ప్ క్షిపణులను, స్టార్మ్ బాంబులను (హ్యామర్ బాంబులు) జారవిడిచాయి. శిబిరాల ధ్వంసరచనలో లాయిటరింగ్ మ్యూనిషన్ (ఆత్మాహుతి డ్రోన్లు) కూడా భాగమయ్యాయి. ఈ హఠాత్పరిణామానికి షాక్‌కి గురైన పాక్ సేనలు.. రాడార్ ట్రాకింగ్ స్టిస్టమ్‌ను యుద్ధ విమానాల వైపునకు మళ్లించాయి. ఇదే అదునుగా అక్కడే తచ్చాడుతున్న భారత డ్రోన్లు ఉగ్ర శిబిరాల దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కెమెరాలతో బంధించాయి. దాడులు జరిగాయన్న ఆధారాల కోసమే ఈ విధంగా చేశాయి. పాక్ సేనలు ప్రతిదాడులకు అప్రమత్తమయ్యే లోగా వాయువేగంతో స్వదేశానికి పరుగుపెట్టాయి.
పొరబడి.. ఆ తర్వాత
‘ఆపరేషన్ సిందూర్’తో పూర్తిగా దెబ్బతిన్న పాక్.. ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అసత్య ప్రచారానికి తెరతీసింది. దీంతో ఎయిర్‌ఫోర్స్ వర్గాలు స్పందించాయి. ‘ఆపరేషన్ సిందూర్’లో ఎలాంటి నష్టం జరుగలేదని, విమానాలు సహా అందరూ సురక్షితంగా తిరిగొచ్చారని వివరించింది.
అడ్డుకోవాలని అంతలోనే..
ఉగ్ర శిబిరాలపై దాడులు చేసి వెనక్కి వస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలను అడ్డుకోవడానికి చైనాకు చెందిన శక్తిమంతమైన జేఎఫ్-17, పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానాలు ప్రయత్నించాయి. అయితే, వాటి ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆయా విమానాలను భారత్ కూల్చేసింది. అయితే, ఈ విషయాన్ని పాక్ తొలుత అంగీకరించనప్పటికీ, ఆ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. పాక్‌కు ఎఫ్-16 విమానాలను అమెరికా సరఫరా చేసింది. ఇదిలాఉండగా.. హనుమంతుడు లంకకు వెళ్లి కాల్చేసి వచ్చినట్టు.. తాము ఉగ్ర శిబిరాలను పేల్చేశామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దీన్ని బట్టి రఫేల్ యుద్ధ విమానాల సాయంతో ఉగ్ర శిబిరాలపై భారత్ క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించిందన్న విషయం అర్థమవుతున్నది.స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులు (స్టార్మ్ బాంబులు), లాయిటరింగ్ మ్యూనిషన్ (ఆత్మాహుతి డ్రోన్ల)ను వాడినట్టు రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు.
యుద్ధం వస్తే పాక్ కనుమరుగే ఆర్మీ మాజీ అధికారుల స్పష్టీకరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7(నమస్తే తెలంగాణ): భారత్, పాక్ మధ్య ఎప్పుడు యుద్ధం వచ్చినా మన సైన్యం సిద్ధంగా ఉందని పలువురు ఆర్మీ మాజీ అధికారులు స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం నేపథ్యంలో దాయాదుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను మట్టుబెట్టడం శుభ పరిణామమని వారు పేర్కొన్నారు. 1965 ఇండో-పాక్ యుద్ధం, 1971 బంగ్లాదేశ్, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న విజయవీరులు వింగ్ కమాండర్, ఎయిర్ కమాండర్, ఆర్మీ హవాల్దార్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
పాక్ నామరూపాల్లేకుండా పోతుంది: ఆవుల భారత్ భూషణ్, రిటైర్డ్ వింగ్ కమాండర్
భారత్‌తో యుద్ధం జరిగితే పాకిస్థాన్ నామరూపాల్లేకుండాపోతుంది. 1965 ఇండో-పాక్, 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరుతోపాటు కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌కు మన దేశం తగిన గుణపాఠం నేర్పింది. ఒకవేళ అణు యుద్ధం జరిగితే పాకిస్థాన్ నేలమట్టమవుతుంది. బోర్డర్‌కు సమీపంలో ఉన్న మన నగరాలు పాక్షికంగా దెబ్బతింటాయి.