Mansarovar Yatra : మానససరోవర్ (Mansarovar) యాత్రికుల తొలి బ్యాచ్ సిక్కిం (Sikkim) రాజధాని గ్యాంగ్‌టక్ (Gangtak) కు చేరుకుంది. ఈ బ్యాచ్ గ్యాంగ్‌టక్‌కు చేరుకోవడం ద్వారా ఈ ఏడాది మానససరోవర్ యాత్ర ప్రారంభమైనట్లు అయ్యింది. తొలి బ్యాచ్‌లో మొత్తం 44 మంది యాత్రికులు గ్యాంగ్‌టక్‌కు చేరుకోగా.. వారిలో 32 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. వారితో మెడికల్ సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు.
సిక్కిం టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్యాంగ్‌టక్‌కు చేరుకున్న తొలి బ్యాచ్‌లో యాత్రికులు దేశంలోని పలు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఢిల్లీకి చెందిన యాత్రికులు ఎక్కువగా ఉన్నారు. మొత్తం యాత్రికుల్లో ఢిల్లీకి చెందిన వారు 11 మంది, మహారాష్ట్రకు చెందినవారు ఆరుగురు ఉన్నారు. తొలి బ్యాచ్ యాత్రికుల్లో బీహార్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
ఈ బ్యాచ్ జూన్ 20 నాటికి టిబెట్ అటానమస్ రీజియన్ అయిన నాథులా పాస్‌కు చేరుకోనుంది. దానికి ముందు హంగూ సరస్సును చేరనుంది. అనంతరం గ్యాంగ్జే గుండా కైలాస్ మానససరోవర్‌కు చేరనుంది. ఈ ఏడాది బ్యాచ్‌కు 50 మంది చొప్పున 10 బ్యాచ్‌లు మానససరోవర్‌కు చేరనున్నాయని సిక్కిం టూరిజం డెవలప్మెంట్ అథారిటీ తెలిపింది.