Mumbai : ముంబైలోని ఒక భవంతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. దహిసర్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్లో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 36 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
దహిసర్ తూర్పు ప్రాంతంలోని 23వ భవంతి ఏడో అంతస్థులో మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో.. ఏడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటన్నరకు పైగా శ్రమించి మంటల్ని ఆర్పేశారు.
ఈ ప్రమాదం నుంచి 36 మందిని నిచ్చెన సాయంతో కాపాడారు. వీళ్లలో గాయపడిన 19 మందిని సమీపంలోని నార్తర్న్ కేర్ హాస్పిట్లో ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతున్న వాళ్లలో నాలుగేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు.ఏడో అంతస్థులోని విద్యుత్ వైర్లు దెబ్బతినడం.. లేదా సరిగా పనిచేయకపోవడం వల్ల రాజుకున్న మంటలు క్రమంగా మంటలు ఎలక్రిక్ వలయం నుంచి పై అంతస్థులకు వ్యాపించాయని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలిపారు.