Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని ఒక టపాసుల పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కౌశంబి జిల్లాలోని టపాసుల పరిశ్రమలో పేలుడు కారణంగా ఏడుగురు మరణించారు. 24 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన యూపీ, కౌశంబి జిల్లా, పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మూద్పూర్లో సోమవారం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
జిల్లా మెజిస్ట్రేట్ అమిత్పాల్ శర్మతోపాటు సీఐ శివాంగ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలోకి అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు భారీగా చేరుకున్నాయి. అలాగే, జేసీబీల్ని కూడా వినియోగిస్తున్నారు. సోమవారం ఉన్నట్లుండి టపాసుల పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ సమయంలో ఫ్యాక్టరీలో పాతికమందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. ఈ పేలుడు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయి.
పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే.. చుట్టుపక్కల 50 మీటర్ల పరిధిలోని అనేక ఇండ్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అధికారులు మంటల్ని ఆర్పి, బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని ప్రయాగ్రాజ్లోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. మృతులు, క్షతగాత్రులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు పూర్తైన తర్వాతే ఈ విషయంలో స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.