Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఇతర కాంగ్రెస్ నేతలపై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీస్ సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమైన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు’ అని బిశ్వశర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ నేతల చర్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశామని గువాహటి పోలీస్ కమిషనర్ దిగంత బోరా చెప్పారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ను నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నిర్వహించవద్దని ఆదేశించినా కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని, నిర్దేశిత మార్గాన్ని వదిలేసి నగరంలోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని, నాయకుల తీరుతో కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై దాడికి పాల్పడ్డారని, అందుకే వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కాంగ్రెస్ దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారన్నారు.
అంతకుముందు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేలా సమూహాన్ని రాహుల్ గాంధీ రెచ్చగొట్టారని, ఆయనపై కేసు నమోదు చేయాలని డీజీపీ జీపీ సింగ్‌ను సీఎం ఆదేశించారు. కాగా, తమ యాత్రను అడ్డుకునేందుకు అస్సాం పోలీసులు దారికి అడ్డంగా బారీకేడ్లు పెట్టడంపై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి వాటిని తొలగించారు. గతంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇదే మార్గంలో ర్యాలీగా వెళ్లారని, ఆయన ర్యాలీకి అనుమతించి, కాంగ్రెస్ యాత్రకు అడ్డుతగలడంలో అంతర్యం ఏమున్నదని ప్రశ్నించారు.