Mamata Banerjee : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దక్షిణ కోల్‌కతాలోని నేతాజి నగర్ పోలీస్ స్టేషన్లో కోల్‌కతాకు చెందిన ఒక వ్యక్తి మమతపై ఫిర్యాదు చేశాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మమత గత మార్చిలో ధర్మతలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకవర్గానికి వ్యతిరేకంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆమెపై నమోదైన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారని, లేకుంటే ఒక వర్గం చేతిలో అణిచివేతకు గురయ్యే వారు అంటూ అప్పట్లో మమత వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో వివరించారు. ఆమె వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు, భయం పెంపొందించేలా, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మమత వ్యవహరించారని ఫిర్యాదులో వివరించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. మే 20న ఈ ఫిర్యాదు దాఖలైంది. శుక్రవారం ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మమతకు తాజా రాజకీయ పరిణామాలు ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే.
పార్టీకి చెందిన మెజారిటీ నేతలు టీఎంసీని వీడుతున్నారు. ఎంపీలు రెబల్స్‌గా ఏర్పడి బీజేపీకి మద్దతు ప్రకటించారు. తమను ప్రత్యేక వర్గంగా చూడాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు టీఎంసీ భవితవ్యంతోపాటు మమత రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారింది.