బెంగళూరు, మే 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు రంగం సిద్ధమైందని కర్ణాటక అధికార కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నకిలీ బిల్లుల్ని సృష్టించి గంగా కల్యాణ పథకంలో కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసినట్టు అంబేద్కర్ అభివృద్ధి నిగమ గతంలో ఫిర్యాదు చేయగా, దీనిపై విధానసౌధ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కేసు విచారణను త్వరలోనే సీఐడీకి బదిలీ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. గత బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో ఫిర్యాదు అందినపుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదని వివరించారు. బావులు తవ్వి, పైప్లైన్ల ద్వారా దళితుల పొలాలకు సాగునీరు అందించటం గంగా కల్యాణ పథకం ఉద్దేశం.