Killer wolfs | ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ (Bahraich) జిల్లాలో ప్రజలకు తోడేళ్లు (Killer wolfs) కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన ఆరు తోడేళ్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. వీటి దాడుల్లో ఇప్పటికే పది మందిదాకా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియా చేపట్టింది. ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఇప్పటివరకూ నాలుగు తోడేళ్లను పట్టుకుంది. తాజాగా మరో తోడేలును అటవీ శాఖ అధికారులు బంధించారు.
బహరాయిచ్‌లోని హరబక్ష్ పూర్వ గ్రామంలో గల ఘఘర నది సమీపంలో ఐదో తోడేలు అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు మంగళవారం చిక్కింది. దీంతో మొత్తం ఐదు తోడేళ్లను అధికారులు బంధించినట్లైంది. ఈ గుంపులోని ఇంకో తోడేలును బంధించాల్సి ఉందని అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు.
#WATCH | Uttar Pradesh: Amid a wolf terror in Bahraich, the fifth wolf has been captured by Forest Department this morning. One more wolf remains to be caught. pic.twitter.com/arjULYQqNU
— ANI (@ANI) September 10, 2024
సుమారు 50 రోజుల నుంచి బహరాయిచ్ సహా మరికొన్ని జిల్లాలో తోడేళ్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉండటం కలచి వేస్తోంది. వీటి దాడిలో సుమారు 35 మంది గాయపడ్డారు.
తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖాధికారులు చిన్న పిల్లల మూత్రంతో తడిసిన రంగు రంగుల టెడ్డీ బేర్లను అవి విశ్రాంతి తీసుకునే నదీ పరీవాహక ప్రాంతాల్లో పెడుతున్నారు. తోడేళ్లు రాత్రి వేళ జనంపై దాడి చేసి, ఉదయానికల్లా తిరిగి తమ విశ్రాంతి ప్రదేశాలకు వెళ్లిపోతున్నాయని డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఈ తోడేళ్ల గుంపు దాడుల కారణంగా సుమారు రెండు నెలలుగా బహరాయిచ్‌లోని 35 గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అటవీ విభాగం అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి రాత్రిపూట ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. తోడేళ్ల దాడుల్ని ‘వైల్డ్‌లైఫ్ డిజాస్టర్’గా యూపీ సర్కార్ ప్రకటించింది.
అంతకుముందు ఈ కిల్లర్ తోడేళ్లను పట్టుకోవడం సవాల్‌గా మారుతుండటంతో పరిస్థితి తీవ్రత దృష్ట్యా అటవీ శాఖ అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్లను పట్టుకోవడం సాధ్యం కాని తరుణంలో అవి కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశించారు (shoot at sight order). అయితే, అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు తోడేళ్లను కాల్చేందుకు తొమ్మిది మంది షూటర్ల బృందం బహరాయిచ్ అడవుల్లో మోహరించింది.
Also Read..
Train | మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. ట్రాక్‌పై బరువైన సిమెంట్ దిమ్మెలు
Gaza | నిరాశ్రయ జోన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 40 మంది మృతి
Rahul Gandhi: కొన్ని మతాలు, భాషలను ఆర్ఎస్ఎస్ తక్కువగా చూస్తోంది: రాహుల్ గాంధీ