బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు కొనసాగుతుండగా ఉప ముఖ్యమంత్రికి పదోన్నతి కల్పించాలని కోరేందుకు ఆయన మద్దతుదారులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. కాగా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని సిద్ధరామయ్య సోమవారం వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన కొందరు ఎమ్మెల్యేలకు అదనంగా డీకే శిబిరానికి చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీ చేరుకోగా మరికొందరు కూడా హస్తిన బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా నాయకత్వ మార్పుపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని, దాన్ని తనతోపాటు డిప్యూటీ సీఎం కూడా అంగీకరించక తప్పదని సిద్ధరామయ్య విలేకరులకు చెప్పారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం.
నేను కొనసాగాలని(ముఖ్యమంత్రిగా) అధిష్ఠానం నిర్ణయిస్తే నేను కొనసాగుతాను. ఏదేమైనప్పటికీ అధిష్ఠానం నిర్ణయమే నాకు శిరోధార్యం. శివకుమార్ కూడా దాన్ని అంగీకరించాలి అని చిక్కబళ్లాపూర్లో ఆయన స్పష్టం చేశారు. శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా అన్న ప్రశ్నకు అధిష్ఠానం నిర్ణయిస్తుందని తాను చెప్పిన తర్వాత కూడా అదే ప్రశ్నను మళ్లీ అడుగుతున్నారని ఆయన విలేకరిపై అసహనం ప్రదర్శించారు. డీకే మద్దతుదారులు ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన తరుణంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నవంబర్ 20వ తేదీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ మాజీ కేపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర ప్రకటించడం కలకలం రేపుతోంది. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీకి రానున్న నేపథ్యంలో ఖర్గే కూడా హస్తినకు పయనం కానున్నట్లు తెలియడంతో వారిద్దరి మధ్య కర్ణాటక నాయకత్వ మార్పు అంశం తప్పక చర్చకు రావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాటలు తనకు వేద వాక్యం లాంటివని శివకుమార్ సోమవారం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు గురించి జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తే తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని, అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను, డీకే శివకుమార్ కట్టుబడి ఉండాల్సి ఉంటుందని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై సోమవారం విలేకరులు ప్రశ్నించినపుడు తాను కూడా ముఖ్యమంత్రి ప్రకటనతో ఏకీభవిస్తున్నానని డీకే చెప్పారు.