న్యూఢిల్లీ, జూన్ 13: అదానీకి విద్యుత్తు ప్రాజెక్టు అప్పగించడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తేవడం ఆ దేశ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ పదవికి ఎసరు తెచ్చింది. సీలోన్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ పదవికి ఫెర్డినాండో రాజీనామా చేశారు. ‘అదానీకి ప్రాజెక్టుపై మోదీ ఒత్తిడి చేసినట్టు అధ్యక్షుడు గొటబయ స్వయంగా నాకు తెలిపారు.
అదానీకి ప్రాజెక్టు దక్కేలా అనుకూలమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని ఆదేశించారు’ అని ప్రకటించిన మూడు రోజుల్లోనే ఫెర్డినాండో తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఫెర్డినాండో రాజీనామాను శ్రీలంక విద్యుత్తు మంత్రి కాంచన విజేశేఖర ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రాజీనామాను ఆమోదించినట్టు చెప్పారు. సీలోన్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డు వైస్ చైర్మన్‌ను ఫెర్డినాండో స్థానంలో నియమించనున్నట్టు తెలిపారు.
పవర్ ప్రాజెక్టు వివాదంపై అదానీ గ్రూప్ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ‘శ్రీలంక విద్యుత్తు అవసరాలను తీర్చాలన్న ఉద్దేశంతోనే అక్కడ పెట్టుబడులు పెట్టాం’ అని అందులో పేర్కొన్నది. తాజా పరిణామాలు తీవ్ర నిరాశను కలిగించాయని తెలిపింది. కాగా ఈ విషయంలో భారత ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.
పార్లమెంటరీ కమిటీ ముందు ఫెర్డినాండో ఇచ్చిన వాంగ్మూలం వీడియోను శ్రీలంక టీవీ చానల్ న్యూస్ ఫస్ట్ ప్రసారం చేయటంతో కలకలం రేగింది. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో వనరుల దోపిడీపై పక్కా ఆధారం బయటపడటంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఈబీ ఉద్యోగులు, ఇంజినీర్లు ఏకంగా సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ ప్లాంటును అంతర్జాతీయ పోటీ బిడ్ల ద్వారా అప్పగిస్తే 4 సెంట్లకే యూనిట్ విద్యుత్తు వచ్చేదని, ఇప్పుడు రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తున్నదని వారు చెప్తున్నారు.
ఎటువంటి పోటీ లేకుండా అదానీకి విద్యుత్తు ప్రాజెక్టు అప్పగించడంపై ఈ నెల 10న శ్రీలంక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ ముందు ఫెర్డినాండో వాంగ్మూలం ఇచ్చారు. శ్రీలంకలో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంటును పోటీ లేకుండా గౌతమ్ అదానీకి కట్టబెట్టేలా మోదీ ఒత్తిడి తెచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ప్రకటనపై శ్రీలంకలో దుమారం రేగింది. ఫెర్డినాండో వ్యాఖ్యలను గొటబయ ఆదివారం ఖండించారు. ఆ వెంటనే ఫెర్డినాండో కూడా తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకొంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం పదవికి ఫెర్డినాండో రాజీనామా చేశారు.