బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు జిల్లాలో ప్రతిపాదిత ఏఐ ఆధారిత టౌన్షిప్ ప్రాజెక్టు కోసం తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు రెండు లక్షల చెట్లను నరికేయాల్సి ఉంటుందని పర్యావరణ ప్రేమికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద ఒక రైతు అడిగిన వివరాలను బెంగళూరు దక్షిణ జిల్లా ఉద్యాన శాఖ అందజేసింది. ఈ టౌన్షిప్ ప్రాజెక్టు వల్ల లక్షలాది పచ్చటి చెట్లు నేలకూలడమే కాక వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వేలాది మంది జీవనోపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం ఈ తొమ్మిది గ్రామాల పరిధిలో 83,5356 పోక చెట్లు, 87,903 కొబ్బరి చెట్లు, 12,550 మామిడి చెట్లు, 3,06,506 అరటి మొక్కలు ఉన్నాయి. వీటికి అదనంగా 2,344 సపోటా చెట్లు, 2,500 గులాబీ మొక్కలు, పలు సీతాఫల చెట్లు, పట్టు క్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పనస, రాగి, వరి, కందులు, అలసందలు, చిక్కుడు, మొక్కజొన్న, వేరుశనగ, ఉలవ పంటలు పండిస్తున్నారు.