న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ దాడులు చేయవచ్చనే భయంతో సరిహద్దులకు పాకిస్థాన్ రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నది. భారత విమానాల కదలికలను పసి గట్టేందుకు సియాల్కోట్, ఫెరోజ్పూర్ సెక్టార్లలో ఈ మోహరింపులు జరిగినట్టు ఇండియా టుడే పేర్కొంది. ఇటీవల అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 58 కిలోమీటర్ల దూరంలో ఖోర్ కంటోన్మెంట్లో అత్యాధునిక టీపీఎస్-77 రాడార్ను పాక్ సైన్యం నిఘా కోసం ఉంచింది. మరోవైపు వరుసగా అయిదో రోజు నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం కవ్వింపు కాల్పులకు పాల్పడింది. అయితే భారత సైనికులు వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. భారత్ తమపై దాడి చేయడం అనివార్యమని ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.