న్యూఢిల్లీ: ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు)కు కేంద్ర హోం శాఖ గట్టి హెచ్చరికలు పంపింది. అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు, మత మార్పిడులకు పాల్పడితే విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. దురుద్దేశంతో నిరసనలను రెచ్చగొట్టినా, ఉగ్రవాద, ర్యాడికల్ సంస్థలతో సంబంధాలు ఉన్నా ఈ చర్య తప్పదని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ వెబ్సైట్లో దీనికి సంబంధించిన నోటీసును సోమవారం ప్రచురించింది.
విదేశీ విరాళాలను స్వీకరించే ఎన్జీవోల కార్యకలాపాలు సాంఘిక లేదా మతపరమైన సామరస్యానికి విఘా తం కలిగించినా ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు వివరించింది. ఏదైనా ఎన్జీవోను ఏయే లక్ష్యాల కోసం ఏర్పాటు చేశారో, ఆయా లక్ష్యాల కోసం విదేశీ విరాళాలను వినియోగించకపోయినా ఇదే చర్య తీసుకుంటామని తెలిపింది.