న్యూఢిల్లీ : రహదారులపై ప్రమాదాలు, మరణాలకు లోపభూయిష్టమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు రూపొందించే కన్సల్టెంట్లే కారణమని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ బుధవారం ఆరోపించారు. జాతీయ రహదారుల నిర్మాణ నాణ్యతలో రాజీపడే కాంట్రాక్టర్లకు జరిమానాలను విధించడమే కాక, వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఆయన హెచ్చరించారు. రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల కోట్ల విలువైన టన్నెల్ పనులకు రవాణా శాఖ టెండర్లు సిద్ధం చేస్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో జరిగిన ఫిక్కీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కొందరు కన్సల్టెంట్లు గూగుల్ సహాయంతో డీపీఆర్‌లు రూపొందిస్తున్నారని, వారి నాణ్యత లేమి డీపీఆర్‌ల కారణంగా ఐదు లక్షల ప్రమాదాలు, 1.8 లక్షల మరణాలు జరిగాయన్నారు. ఇకపై కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లకు రేటింగ్స్ ఇస్తామని, తర్వాతి ప్రాజెక్టులకు వాటినే ప్రమాణంగా తీసుకుంటామని ఆయన తెలిపారు. కొన్ని సంస్థలు కాంట్రాక్టులను 20 శాతం అంతకన్నా తక్కువ కోట్ చేసి దక్కించుకోవడాన్ని ప్రస్తావిస్తూ దీని కారణంగా నాణ్యతపై తీవ్ర ఒత్తిడి పడుతుందని అన్నారు.